Sunday 3 May 2015

ఒక కథకి ప్రేమతో .... మరో కథ

ఈ మధ్య కినిగె పత్రికలో ఒక కథ చదివాను(పాతదే). ఆకథ, కథలోని పాత్రలు ఎంతగా నచ్చాయంటే , ఫిమేల్ వెర్షన్ లో ఉన్న ఆ కథకి , మేల్ 
వెర్షన్ రాయాలన్న బలమైన కోరిక కలిగింది . ఆ కోరికలోంచి పుట్టిందే ఈ కథ . ఇంతకుముందు ఇటువంటి ప్రయోగమో , పిచ్చి పనో ఎవరైనా చేసారో లేదో తెలీదు గానీ నాకు మాత్రం ఇలా రాయడం ఎంతో తృప్తిని కలిగించింది . ముందు అసలు కథ చదివిన తర్వాత ఈ కథ చదవడం న్యాయమని నా ఉద్దేశ్యం 
తరళ మేఘచ్ఛాయ,తర్వాతి ఎడారి ఇక్కడ చదవండి . ఆపైన ఉత్సాహం, ఓపికా ఉంటే .............. 
                   రెండమావాస్యలు, ఓ ఒంటరి వెన్నెల   

"రేయ్ , ఆ ప్రవాహాన్ని చూస్తుంటే ఏమనిపిస్తోందో చెప్పు " ఉత్సాహంగా అడిగాడతను  .
కల్పన వింతగా చూసింది ఆ కొత్త పిలుపుకో, అతను అడిగిన ప్రశ్నకో. " ఏమనిపిస్తుంది ! రిజర్వాయర్లో నీళ్లు నిండుగా ఉన్నాయనిపిస్తోంది . "
ఉలికిపాటుని తలాడింపుతో కప్పిపుచ్చుకుంటూ మళ్ళీ అటు వైపు దృష్టి సారించాడు.  ఏ అందమైన దృశ్యాన్ని చూసినా అలా ఒకరినొకరు అడగడం వాళ్లిద్దరికీ ఆటగా మారిన అలవాటు.  చాలాసార్లు తనే ముందు అడిగేసేది అతనికి అవకాశం ఇవ్వకుండా . ఇప్పుడు ఆమైతే ఏమని చెప్పి ఉండేది!  దోసిళ్లలోంచి జారిపోయే పారిజాతాలు గుర్తొస్తున్నాయనేదేమో ! "పారిజాతాల ఉప్పెన.... నువ్వు సినిమా తీస్తే టైటిల్ గా వాడుకో . నీ కోసం ఫ్రీరా " అని పగలబడి నవ్వేదేమో కూడా .

"మళ్ళీ వెళ్లిపోయావా బాలూ ఫ్యూచర్లోకి !" కల్పన నవ్వుతూనే అన్నా ఆమె గొంతులో నిరాశ స్పష్టంగా ధ్వనిస్తోంది . తనకి  భవిష్యత్తు ఎక్కడుంది! అసలు వర్తమానమే లేదు . ఉన్నదల్లా గతమే. ఆమెని నింపుకున్న గతం . తనని ఆమెలో నింపిన గతం .

ఒక స్టేజ్ షోలో ఆఖరి పాట పాడబోయే ముందు ఆడియన్స్ లో చూసాడు ఆమెని మొట్ట మొదటగా. చూడగానే ఆకట్టుకునే అందంమే అయినా  కట్టూ బొట్టులోని హుందాతనం, వక్ర దృష్టి మాట అటుంచి ఆసక్తిని కూడా కలిగించుకోవడం పాపమనే భావాన్ని ప్రేరేపించే విధంగా ఉంది . అయినా చూపు తిప్పుకోనివ్వకుండా కట్టి పడేసినవి ఆ కళ్లు . వాటిలో అతన్ని అంతగా ఆకర్షించింది వాటి విశాలత్వం కాదు.  అట్టడుగున సుడిగుండాలు దాచుకుని పైపైన స్వచ్ఛతని కనబరుస్తూ అవి చేస్తున్న మానిప్యులేషన్ అతన్ని సూదంటురాయిలా పట్టుకు లాగింది .

కానీ రాగంలో లీనమైతే తప్ప పాడలేని బలహీనత కారణంగా ఆ కుతూహలాన్ని ఎక్కువ సేపు నిలుపుకోలేకపోయాడు. కొన్ని నిమిషాల పాటు ఓ కమ్మని పాట అతని హృదయంలోంచి స్వరం గుండా ప్రవహించింది. కరతాళ ధ్వనుల పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చి పడీ పడగానే  అప్రయత్నంగానే అతని కళ్లు ఇంతకుముందు ఆపిన పనిని మళ్లీ కొనసాగించాయి . ఇంకా అక్కడే ఉందామె .  ఈసారి ఆ కళ్లలో ఏదో వింత మెరుపు . ఇంతకుముందు లేనిది . ఇప్పుడే పుట్టిందా అన్నట్టుగా అలలు అలలుగా పారుతూ  . తన పాట విన్న ఆనందమేనా అది ! అతనిలో ఓ విధమైన గర్వం బయలుదేరబోయింది .  ఆ భావంలో ఎక్కువసేపు నిలబడనివ్వకుండా మరోసారి చప్పట్ల చప్పుడు చుట్టుముట్టింది, ఇక తను అక్కడినించి వెళ్లిపోవచ్చన్న విషయాన్ని గుర్తుచేస్తూ.  ఏదో తెలియని  మైమరపు కమ్ముకుంటుంటే తనని తాను స్వాధీనపరుచుకుంటూ స్టేజ్ దిగి కిందకి వచ్చాడు .

 ఆ కొత్త అనుభూతి , కలవరం ఆలోచనకి అడ్డం పడుతూ ఏమీ తోచనివ్వడం లేదు . కళ్లు తెరిచినా మూసినా ఆ రూపమే, తన వైపు ఆరాధనగా చూస్తూ .  బైక్ దగ్గరికి వెళ్లి కూడా  స్టార్ట్ చెయ్యడం ఎలాగో మరచిపోయినట్టుగా దాని మీదే కూర్చుని ఉండిపోయాడు . నవ్వులూ, కేకలూ దూరమవుతూ స్నేహితులంతా ముందుకు సాగిపోయారన్న విషయాన్ని సూచిస్తున్నా , ఏదో జడత్వం శరీరాన్ని అదుపులోకి తీసుకుని కదలనివ్వక కలవరపెడుతోంది .

ఇంతలో కనిపించింది మళ్లీ ఆమె . దూసుకొస్తున్న తోకచుక్కలా శరవేగంగా వచ్చి అతని పక్కనున్న మసక చీకట్లో ఆగింది . మునిపంటి కింద పడి నలుగుతున్న  ఆ ఎర్రని పెదవి, పల్చని వెలుతురులోంచి ఆమె నిరాశని ప్రసరింపజేస్తోంది . ఎవరికోసమో వెతుకుతున్న ఆమె కదలికల సాక్షిగా నిశ్శబ్దాన్ని చీలుస్తూ గాజుల చప్పుడు . తనకోసమే వచ్చిందా ? మనసులో ఏదో మూల చిన్న ఆశ . కాదేమోనన్న సంశయం,  ఎదురుపడాలన్న కోరిక మీద విజయం సాధించడంతో కదలకుండా అలానే ఉండిపోయాడు ఆమె కార్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయేవరకూ. అప్పుడు హఠాత్తుగా పుట్టిన ఓ పిచ్చితనం , అతని విచక్షణాజ్ఞానాన్ని తునాతునకలు చేసి ఆమెని వెంబడించే ధైర్యాన్ని కలిగించింది . చాలా పెద్ద బంగళానే . ఆమె ముందు తనెక్కడ! అందదేమోనన్న భయం , కావాలనిపించే తపనని మరింత తీవ్రతరం చేస్తూ! అది మొదలు అతని ప్రపంచమే మారిపోయింది . సింగర్ గా , రైటర్ గా గుర్తింపు కోసం తను పడుతున్న సంఘర్షణల మధ్య ఏర్పడిన  ఖాళీతనం, ఆమె గురించిన ఆలోచనల్ని మరింత ఎగదోసి , నిరాశ నిండిన ఉదయాల్నీ , నిద్ర పట్టని రాత్రుల్నీ పరిచయం చేసింది. నరాల్ని మెలిపెట్టే ఆ తీపి బాధ నుంచి తప్పించుకోవడమెలాగానే  సమస్యకి  ఆమెని పదే పదే చూడటమే పరిష్కారమయింది .

ఆమె ఇంటి దగ్గర కాపు కాయడం , బయటకి వెళ్లినప్పుడు వెంబడించడం , దూరం నుండి ఆమెని గమనించి ఆనందపడటం  అతనికి ఒక వ్యసనంగా మారింది . సరిగ్గా అప్పుడే ఎప్పుడో , అలా వెంబడిస్తున్న ఒకానొక సందర్భంలో ఆమె దృష్టి తన మీద పడింది  . తను ఆమెని అనుసరిస్తున్న విషయం గమనించిందేమోనని చాలా కంగారుపడ్డాడు . కానీ తను కొన్న పుస్తకమే ఆమెకి కూడా కావాల్సిరావడంతో వచ్చి పలకరించింది. అలాగని అతననుకున్నాడు . నిజానికి ఆమె తనని గుర్తుపట్టిందనీ, ఆ నెలరోజులుగా తన గురించే ఆలోచించిందనీ తర్వాతెప్పుడో చెప్పింది ఓసారి . అప్పుడు కూడా అతను బయటపడలేదు . తమ పరిచయం యాదృచ్ఛికమనే భ్రమనే ఆమెలో కొనసాగనిచ్చాడు.
ఎందుకన్నది అతనికీ తెలీదు .

ఇద్దరూ మాట్లాడుకోవడం , ఫోన్ నంబర్లు మార్చుకోవడం  అన్నీ కలలోలా జరిగిపోయాయి . తన తడబాటుని అర్థం చేసుకున్నట్టుగా ఆమే చొరవ చూపింది . తనకి ఆమెంత ముఖ్యమో , ఆమెకి కూడా తనంతే ముఖ్యమనిపించేలా ప్రవర్తించి తన సంశయాన్నీ, సందేహాల్నీ చిటికెలో మాయం చేసింది . అప్పుటినించీ ఇక ఆమె తోటిదే లోకం. ఆమె గురించిన ఆలోచన కలగని క్షణాలే లేనంతగా తన జీవితం మొత్తం ఆమెగా మారిపోయింది .

ఏళ్ల తరబడి వర్షాలు లేక బీటలు వారిన నల్లమన్నేమో అనిపించేది ఆమె మనసు . తను రాల్చిన  ప్రతి చిన్న భావంలోంచీ , చర్యలోంచీ, మాటలోంచీ ఆప్యాయతనీ , అనురాగాన్నీ పీల్చుకుని కళ్లలో సంతోషాల్ని మొలకెత్తించుకునేది . పసిపాపలా కరిగిపోతూ అతనికో పెద్దరికాన్ని ఆపాదించేది . మోయలేనంత ఇష్టాన్నీ, గౌరవాన్నీ ప్రదర్శించి , అతనిలోని మేల్ ఇగో గర్వంతో ఒళ్లు విరుచుకునేలా చేసేది .

మేల్ అన్న తర్వాత ఇగో ఒకటే కాదుగా ఉండేది! మరింకేవో కోరికలు కూడా ఆమె సమక్షంలో ఒళ్లు విరుచుకునేవి . దేహాన్ని సలసలా మరిగించేవి . చివరికి ఓ అభ్యంతరం ఎదురుకాని ఒంటరితనం సాక్షిగా అపురూపమైన కొన్ని అనుభవాలు అతని సొంతమయ్యాయి . అప్పటివరకు స్త్రీ స్పర్శ తెలియని శరీరం వింత ఆనందంతో పులకించిపోయింది . ఇక చాలు, ప్రాణం పోయినా పరవాలేదనిపించేంత తృప్తి .

అప్పుడయ్యాడు పూర్తిగా ఆమెకి దాసోహం . అప్పటివరకు చిన్న నలుసులా మెరిగిన వయసులోని వ్యత్యాసం, ఆ నిమిషంలో మటుమాయమైపోయింది . పదేహేనేళ్లు అంతేగా . అంత పెద్ద వయసు భర్తలు ఎందరు స్త్రీలకి లేరు మనదేశంలో! తమ విషయంలో పరిస్థితి తారుమారవుతుందంతే . ఆమె ఒక వివాహితన్న సంశయం ఏ కొంచెమైనా ఉండి ఉంటే, అదీ అప్పుడే తుడిచిపెట్టుకుపోయింది . ఆమె వైవాహిక జీవితం ఏమంత గొప్పగా లేదన్న విషయం తను చెప్పకపోయినా అతనికి మొదట్నించీ తెలుసు . ఆమె తనకి కావాలి . తనకే పూర్తిగా కావాలి . ఇలా అప్పుడో ఇప్పుడో దొంగచాటుగా కాదు . ఎప్పుడూ , ఎప్పటికీ కావాలి.

"ఈ ఆంటీతో ఏంటిరా నీకు , జీవితమంతా ముందుంది " అని ఆమె తనని తాను చిన్నబుచ్చుకుంటే  ఎంత విలవిల్లాడిపోయిందో  ప్రాణం . "దెబ్బలు కావాలా , నోరు మూసుకో. మళ్ళీ అలాంటి మాటలంటే చంపుతా " అన్నాడు ఆవేశంగా .  తను ప్రదర్శించిన కోపానికి  కళ్ల నీళ్లు పెట్టుకుంది .  నా బంగారం అంటూ నుదుటిని ఆర్తిగా ముద్దాడింది  . చలం మైదానపు ముగింపుని మనం  తిరగరాద్దామని తను ఉద్వేగానికి లోనైతే నీళ్లు  చిప్పరిల్లిన కళ్లతో, నవ్వుతూ తల మీద చిన్నగా ఓ దెబ్బ వేసింది .

తను కళాకారుడే  అయినా ఆమె కళా హృదయం ముందర దిగదుడుపే. పాడుతున్న పాటో, దాని తాలూకూ సాహిత్యమో , అది తెచ్చి పెట్టే ప్రశంసో మాత్రమే తనకి ఆనందాన్ని కలిగిస్తాయి . కానీ ఆమెకి చేసే ప్రతి పనిలోంచీ  ఆనందాన్ని వెలికితీయగల మంత్రమేదో తెలుసు . కళని ప్రదర్శించడం వేరు , ఆస్వాదించగలగడం వేరు. పూలకి తావి ఎంత సహజమో,  స్త్రీల హృదయాలకి  సౌందర్యాస్వాదన  అంత అలవోకగా  అబ్బుతుందేమో అనిపించేది ఆమెని చూస్తే. ఆ ప్రకృతి అందాలూ, ఆలోచనలూ , తనతో పాటుగా ఉన్న పురుషుడి జీవితాన్ని కూడా పరిమళభరితం చేస్తాయని అనుభవపూర్వకంగా తెలిసింది అప్పుడే . ఆ మాటే తనతో చెబితే "ఇందుకే నాన్నా. ఆడవాళ్లంటే నీకున్న ఈ గౌరవం చూసే నేను పూర్తిగా పడిపోయింది. " అంది లాలనగా .

అంతా బాగుందనీ, ఎప్పటికీ ఆగిపోని ప్రయాణమనీ సర్దుకు కూర్చునేలోపే ఎందుకో తమ ప్రణయపు రైలుబండి చిన్న కుదుపుతో ఆగిపోయింది . ఫోన్ చెయ్యడం మాట అటుంచి , తను చేస్తే అటెండ్ కావడమే మానేసింది . ఏం జరిగింది? ఎందుకు ఇంతలో అంత మార్పు? ఆ ఆరాధనంతా ఏమైంది? తను మొహం మొత్తిపోయాడా? ఛీ ఛీ! ఆమె గురించి అలా ఎలా ఆలోచించగలుగుతున్నాడు. ఏదో పెద్ద సమస్యే వచ్చి ఉంటుంది . తనకి చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక ఇలా తప్పించుకుంటోంది. ఎన్నెన్నో తర్కాలు .  వాదాలూ  ప్రతివాదాలూ తనవే . ఒక్కసారి పిచ్చి పట్టినట్టుగా అయింది . తీవ్రమైన నిర్వేదం . పక్క మీంచి లేవడం , పక్క వీధికి నడవడం లాంటి చిన్న చిన్న పనులు కూడా భారమైపోయేంత నిస్సత్తువ . ఇప్పటివరకు స్వర్గాన్ని చూపిన ప్రేమ ఎంతటి నరకానికి కూడా గురి చెయ్యగలదో అర్థమైన రోజులవి . వద్దొద్దు , అంత వేదన పగవాడికి కూడా వద్దు .

ఎంతకీ వినిపించని ఆమె గొంతుకోసం మొబైల్ ని పదేపదే డయల్ చేసీ చేసీ, నిరాశచెందే ఓపిక కూడా నశించిపోయాకా, దిక్కుతోచని స్థితిలో ఆమె వర్క్ చేస్తున్న కాలేజ్ దగ్గరికే నేరుగా వెళ్లిపోయాడు. బయటకి వచ్చి కలిసింది కానీ ముఖం నిండా అదే ముభావం . మాట్లాడందే వదలడని అర్థమైందేమో దగ్గర్లో ఉన్న ఓ రెస్టారెంట్ కి తీసుకెళ్లింది. ఎదురెదురుగానే ఉన్నా యుగాలకొద్దీ దూరం ఇద్దరి మధ్యనా . నీరెండ పడి ఆమె ముక్కుపుడకలోని యెర్ర రాయి వింతగా మెరవడం తను ఎప్పటికీ మరచిపోలేడు! అసలు అప్పుడు తనతో ఉన్నది ఆమేనా! అంత నిర్దయగా, నిర్లక్ష్యంగా ఎలా ఉండగలిగింది! కోప్పడాలో , బాధ వ్యక్తపరచాలో , బ్రతిమాలాలో అర్థం కాక అలా ఆమె వైపు చూస్తూ కూర్చుండిపోయాడు . అది కూడా నచ్చలేనట్టుంది . పదునైన చూపుల్నీ , కరుకైన మాటల్నీ ఆయుధాలుగా  చేసుకుని యుద్ధం మొదలుపెట్టింది . కూతురూ , ఆ అమ్మాయి భవితవ్యం అంటూ పాత పాఠమే మళ్ళీ చెప్పింది . ఆ అమ్మాయి, టీనేజ్ ప్రభావం వల్ల  ఏదో చిన్నపాటి ఆకర్షణని ప్రేమగా భ్రమిస్తోందనీ , తనని సరైన దారిలో నడిపించడం కోసమే ఇలా చెయ్యాల్సివచ్చిందనీ చెబుతూ. ఆ పిల్ల భవిష్యత్తు కోసం తామిద్దరూ దూరం కావడమే మంచిదనే అర్థం వచ్చేలా  సమర్ధింపులాంటి ఓ సంజాయిషీ ఇచ్చుకుంది . నిజంగా ఆమె  సమస్య స్వప్నేనా ? అదే నిజమైతే తన కళ్లలోకి చూస్తూ ఎందుకు మాట్లాడలేకపోతోంది? ఒకవేళ విషయం అదే అయినా తన సంగతేంటి? ఏమైపోతాడు ఆమె లేకుండా!
సందేహలెన్నో , సమాధానాలివ్వడానికే ఆమె సిద్ధంగా లేదు .

తన వాదనలో బలం లేదని తెలిసిందేమో , మరో వైపుగా దాడి ప్రారంభించింది . ఈసారి ఆమె లక్ష్యం తన అహం . తన సంపాదనాలేమి . తన చేతకానితనం . పాతికేళ్లు పైబడినా జీవితంలో కుదురుకోనివ్వని తన అసమర్థత . అప్పుడు ఆమెకి కావాల్సిందేమిటో అతనికి తెల్సినట్టుగా అనిపించింది. తను దూరం కావడమే కావాలి ఆమెకి . తను ఆమె జీవితంలో లేకపోవడం కావాలి . అలా జరగడం కోసమే , జరిగేలా చెయ్యడం కోసమే ఇదంతా .  తనకి కావాల్సిన విధంగా ఎదుటివాళ్లు ప్రవర్తించేలా చేసుకోగలగడం ఆమెకి తెలిసిన  గొప్ప కళల్లో ఒకటి . ఆమె అలా చెయ్యడానికి కారణమేమిటో తనకి తెలీదు . ఇక తెలుసుకోవాలని కూడా అనిపించలేదు.  ఆమెని ఇబ్బంది పెట్టే సంతోషం తనకి మాత్రం ఎందుకు! ఆమె తన నుండి ఎటువంటి స్పందన కోరుకుంటోందో అలాగే స్పందించాడు . ఆమె మాటలకి గాయపడ్డట్టుగానే ప్రవర్తించాడు. తనకి దూరంగా ఈ ఒంటరితనం వైపుకి ఇలా నడుచుకుంటూ వచ్చేసాడు.
                                                                                                                          ******************.
"బాలూ , పగటి కలలు కనడం పూర్తయితే వెళదామా?" ఈసారి కల్పన మాటల్లోంచి కోపం కూడా వినిపించింది, మరోసారి తనది కాని లోకంలోకి అతన్ని బలవంతంగా లాక్కొస్తూ .
“హే , చూడు మన పిక్ ఇప్పుడు అప్లోడ్ చేసానో లేదో ,  అప్పుడే ఎన్ని లైక్సో ఫేస్బుక్ లో!” అన్నాడు ఆమెని చల్లబరిచే ప్రయత్నంలో భాగంగా . ఆమె ఆసక్తిగా మొబైల్ చేతిలోకి తీసుకుంది . వెనకనుండి రిజర్వాయర్ ఘోష గట్టిగా వినిపిస్తోంది తన గతం తాలూకూ చప్పుడులా .

తన తల్లి, ఆమె ఆరాధ్య గాయకుడినీ ఇష్ట దైవాన్నీ కలుపుతూ పెట్టిన పేరు, తన పేరు  బాలూమాధవ్  పక్కన తరళ, తన తరళ పేరు ఎంత బాగుంటుంది! కానీ ఏం ప్రయోజనం? తను వెళ్లిపోయింది . కురిసిపోయిన మేఘంలా తన జీవితంలోంచి కరిగి వెళ్లిపోయింది .  ఇక మిగిలింది తడిసి బరువెక్కిన జ్ఞాపకాలే.  ఇప్పుడిక ఆ జ్ఞాపకాల్లోంచి కూడా ఆమె మెల్లమెల్లగా జారిపోతోందని అర్థమవుతూనే ఉంది . గాయం పాతబడిపోవడానికి ఆరేడేళ్ల కాలం తక్కువేమీ కాదు కదా .  కలిసొస్తున్న అవకాశాల కారణంగా ఆర్థికంగా కుదుటపడుతున్న జీవితం , మరో తోడు వెతుక్కోక తప్పని పరిస్థితులు కల్పిస్తోంది . తనని గతంలోంచి పూర్తిగా బయటకి లాగగలిగే శక్తి కల్పనకి లేదని అతనికి తెలుసు . మరో తరళ మేఘచ్ఛాయ  తనని వెతుక్కుంటూ తరలి వచ్చేవరకూ, ఎడారి ఎండలా ఈ ఎదురు చూపులు తప్పవేమో! తరళించిన ఈ వెన్నెల తర్వాతి చీకటి కంటే అంతకుముందరి అంధకారమే నయం కదూ అనిపిస్తుంది అప్పుడప్పుడూ!

(ఆమెకి కథల్లో కొస మెరుపులంటే చాలా ఇష్టం . ఈ కథకి కూడా ఒక కొస మెరుపు ఉండే తీరాలని  అనుకుంటే అది ఆమె తెలుసుకోకపోవడమే మంచిదేమో! ఎందుకంటే , తను ఎంతో కష్టపడి కలిపిన ప్రేమ జంటలోని తన స్నేహితుడి భార్య లోహిత  , ఆమె గారాల పట్టి స్వప్నలోహితేనని వాళ్ళ పెళ్లి తర్వాతే తెలిసింది అతనికి .)

               ****************************************

2 comments:

  1. chinnapudu vinaanu bharathani mugguru kavulu telugu lo vrasarani, malli ippudu chusthunna....
    bagundhi... kotha prayathnam........

    ReplyDelete