Friday 1 May 2015

## రెప్పల కింద ##

ఓ నిశి రాత్రి వేళ దీపమేదో వెలుగుతుంది 
నల్లని చీకటిని బొట్లు బొట్లు గా తనలోకి రాల్చుకుంటూ 

కుదురు కోల్పోయిన కనురెప్పల అలికిడికి 
కంటిపాపలపై వాలిన ఓ కమ్మని కల అదాటున కరిగిపోతుంది 

కుండీలో చీడ పట్టి పోతున్న గులాబీ మొక్క 
గుండె మీద దిగులు దిగులుగా మొగ్గలేస్తుంది 

ఎన్నాళ్లనించో మాటు వేసి ఉన్న ఓ ఒంటరితనం 
ఈ ఏమరపాటు లోంచి చొరవగా బయటకి చొచ్చుకొస్తుంది 

ఎప్పుడెప్పుడో చెరపలేక రాసిన రాతలేవో 
నీటిమూటలై ఉనికిని చాటుకుంటాయి 

భారమైపోయిన ఆప్యాయతలో 
దగ్గర కాలేక పోయిన దూరపుతనాలో చెంపలపై ఆటుపోట్లుగా అలలెత్తుతాయి  

పెన్నూ పేపరూ లేని సమయం చూసుకుని 
కొత్త కొత్త కల్పనలు కొన్ని కుదురుగా కవ్విస్తాయి 

గతాన్ని సమాధుల్లోంచి తవ్వి పోస్తూ 
భవిష్యత్తుని బటర్ ఫ్లై ఎఫెక్ట్ లో చూపిస్తూ కాలం కసితీరా ఆడుకుంటుంది 

ఓ నిద్రా,  
రెప్పల కింద మెలకువని వెలిగించి నువ్వెళ్ళిపోయాక 
చంద్రుడ్ని మింగే తొలి పొద్దు కోసం యుగాల్ని లెక్క పెడుతూ 
కదలని గడియారం ముళ్ళు , నేను ఇలా అంతర్యుద్ధంలో మిగిలిపోతాం   
(మొదటి ప్రచురణ వాకిలి లో )

No comments:

Post a Comment