Friday 1 May 2015

## ఆమెని చుట్టుకుని ##

ఆమె అణువణువు పైనా మెత్తగా పరుచుకున్న నా తనువు
నా రంగుల్లో కళ్ళని ముంచి
ఆమె వెలువరిచే 'చిత్ర'మైన అహంకారాలు
తన ఒంపుల్లో చిక్కుకున్న నా ఊపిరి నిండా నిప్పుల సుగంధాలు

ఆ పాదాల పైనో,పట్టీల మువ్వలపైనో
ఉండుండీ నా చుంబనపు గరుకైన అలికిడి
నా వేళ్ళ కొసలు ఏ కొమ్మ చివర్నో పట్టుకున్నపుడు
ఆమెలో చురుక్కుమని రేగే చిగురంత చిరాకు

ఎంతకీ లొంగక అల్లరి చేసిన సమయాల్లో
ఆమె జడ విసుర్ల కోపానిది ఓ మెత్తని రుచి
కసితీరా గుచ్చిన పిన్నుల రంధ్రాలు
నాలోకి ఆమె పంపే గాయపు బహుమానాలు

ఆమె చేతి వేళ్ళు చెక్కిన నా రూప ప్రవాహం
చూసే ప్రతి కళ్ళ జతలోంచి ప్రశంసగా తిరిగి నాలోకే
నాతో ఉన్న తననో, తనని చుట్టుకున్న నన్నో చూసి
తన్మయత్వాన కొన్ని తమకంతో మరి కొన్ని హృదయాల వింత కంపన

ఆమె నన్నుఎంచుకున్నరోజు రాజయోగాన రెప రెపలాడుతూ
చిరుగాలితో పరిహాసమాడుతూ
ఐదున్నర గజాల ఎగిరెగిరి పడుతూ,
లేదంటే ఏ బీరువా మూలనో మడతల్లో ఓ ముడతనవుతూ !!
(మొదటి ప్రచురణ కినిగే లో )

No comments:

Post a Comment